వ్యక్తిగత బీమాపై నో జీఎస్టీ.. ఇక 5, 18 శాతం స్లాబులే..

Facebook
X
LinkedIn

జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలను వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ :

కొత్త వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం త్వరలో అమల్లోకి రాబోతున్నది. ఇప్పుడున్న 4 స్లాబుల్లో ఇక 2 స్లాబులే మిగిలి ఉండనున్నాయి. ఈ నెల 22 నుంచి మారిన స్లాబుల ప్రకారం ఆయా వస్తూత్పత్తులపై నూతన పన్ను రేట్లు వర్తించనున్నాయని ఇక్కడ జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కాగా, స్లాబుల తగ్గనున్న నిత్యావసరాలు, వాహన ధరలు కుదింపునకు సమావేశంలో రాష్ర్టాలు అంగీకరించినట్టు చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా మారిన జీఎస్టీ రేట్లే చలామణిలో ఉంటాయన్నారు. చాలావరకు నిత్యావసరాలపై పన్నుల భారం తగ్గిందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమాలపై పన్ను ఎత్తివేసినట్టు తెలిపారు. దీంతో ఆయా పాలసీదారులపై ప్రీమియం భారం తగ్గనున్నది.మరికొన్ని నిత్యావసరాలపైనా జీఎస్టీ మినహాయింపునిచ్చినట్టు వివరించారు. అంతేగాక విద్యార్థుల కోసం పెన్సిల్‌ షార్ప్‌నర్లు, మ్యాప్‌లు, ఎరేజర్లు, ఎక్సర్‌సైజ్‌ బుక్‌లపై పన్నును తీసేశారు. అలాగే ఈవీలపై 5 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. అయితే సిగరెట్లు సహా ఇతర పొగాకు ఉత్పత్తులపై ఎప్పట్లాగే 28 శాతం జీఎస్టీ, నష్టపరిహార సెస్సు పడుతుందని మంత్రి స్పష్టం చేశారు. కరోనా దృష్ట్యా జీఎస్టీ చెల్లింపుల కోసం తెచ్చిన రుణాలు తీరేంత వరకు ఇంతేనని తేల్చిచెప్పారు. ఆ తర్వాత కొత్త పన్నులు వర్తిస్తాయన్నారు. మారిన విధానంతో రెవిన్యూ నష్టం రూ.48,000 కోట్లు అని వెల్లడించారు. ఇదిలావుంటే జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కనబర్చారు. అలాగే వ్యాపార నిర్వహణ, ముఖ్యంగా చిరు వ్యాపారులకు లాభం చేకూరుతుందన్నారు. అమెరికా సుంకాలతో ప్రభావితమైన దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ భారం తగ్గింపుతో కొత్త జోష్‌ రాగలదన్నారు.

ప్రస్తుతం జీఎస్టీ ప్రధాన స్లాబులు నాలుగున్నాయి. అయితే వీటిని రెండుకు తగ్గిస్తామని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా తాజా జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయాలు వెలువడ్డాయి. కాగా, ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం స్లాబుల్లో 12, 28 శాతం స్లాబులను తీసేశారు. ఈ క్రమంలోనే 12 శాతం జీఎస్టీని ఎదుర్కొంటున్న 99 శాతం వస్తూత్పత్తులను 5 శాతంలోకి, 28 శాతం పన్ను పడుతున్న వాటిలో 90 శాతం వస్తూత్పత్తులను 18 శాతంలోకి తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ప్రత్యేకంగా 40 శాతం స్లాబును ఏర్పాటు చేయగా, ఇందులో 6-7 వస్తూత్పత్తులే ఉంటున్నాయి. వీటిలో పొగాకు, పాన్‌ మసాలా, లగ్జరీ బైకులు, కార్లు మొదలైన వాటిని ఉంచుతున్నారు.