మహాకవి ఆరుద్ర శత జయంతి ఉత్సవాలు

Facebook
X
LinkedIn

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మహాకవి రచయిత ఆరుద్ర శత జయంతి సందర్భంగా 31 8 2025 ఆదివారం ఉదయం 11 గంటలకు కమలానగర్ ఆఫీసులో సంస్మరణ సభ జరిగింది. ఆరుద్ర శతజయంతి కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. స్ఫూర్తి గ్రూపు నాయకులు కృష్ణమాచార్యులు ఆరుద్ర చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఆరుద్ర 1925 ఆగస్టు 31వ తేదీన జన్మించారు. ఆరుద్ర గారు గొప్ప కవి రచయితే కాకుండా సమకాలీన జీవితాలపై అనేక విశ్లేషణాత్మక రచనలు చేశారు. ఎంతో గొప్ప గొప్ప సినిమా పాటలు రాసి ఎంతో గౌరవాన్ని పొందారు. అభ్యుదయ సాహిత్యాన్ని పరిశోధనాత్మక రచనలతో ప్రజలను మేల్కొల్పు చేశారు. కూనలమ్మ పదాలు, త్వమేహం అనే గొప్ప కవితా సంపుటిని ప్రచురించారు తెలంగాణ సాయుధ పోరాటానికి ఆ రచన ఎంతో దోహదపడింది. సాహిత్యరంగంలో ఆయన చేసిన కృషి పేరెన్నిక గన్నది. సమగ్రాంద్ర తెలుగు సాహిత్యాన్ని 12 సంపుటాలుగా రాసి మొత్తం తెలుగు సాహిత్యాన్ని మన ముందుచారని అన్నారు.

ప్రముఖ జర్నలిస్టు గుమ్మడి హరి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉన్నప్పుడు వారితో కలవడం జరిగిందని అన్నారు. ఆనాడు ఆయన ఒకటే చెప్పారు మీరు తప్పనిసరిగా సాహిత్యాన్ని చదవాలని, భవిష్యత్తు బాధ్యతలు వచ్చిన తర్వాత కష్టమవుతుందని అందుకే ఇదే సరైన సమయం అని బోధించారని చెప్పారు. ఫలితంగా ఆనాడు చేసిన కృషి ఫలితం నేడు సాహిత్యరంగంలో ఉన్నానని అన్నారు.

ప్రజాతంత్ర ఉద్యమ నేత కోమటి రవి మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థులుగా ఆరుద్ర గారితో మేము కలిసినప్పుడు ఒక ప్రశ్న వేశారు. అజ్ఞానం ప్లస్ భయం ఏమవుతుందని ప్రశ్నించారు. మేము చెప్పలేకపోయాము. అప్పుడు ఆయనే సమాధానం చెప్పారు. అజ్ఞానం ప్లస్ భయము కలిపితే దేవుడు అని అన్నారు. ఎప్పుడు దానిని జ్ఞాపకం పెట్టుకొని విజ్ఞానవంతులుగా జీవించాలని చెప్పారు. అది నన్నెంతో ప్రభావం చూపిందని చెప్పారు.

ఎం భాస్కర్ రావు , జి శివరామకృష్ణ , శారద , బాలు , శ్రీనివాసరావు ,గొడుగు యాదగిరిరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం ఆరుద్ర చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాస్, శ్రీనివాసరావు, జె చంద్రశేఖర్, రెహమాన్, కోమటి రవి, శారద, బాలు, భాస్కర్ రావు, గుమ్మడి హరిప్రసాద్ శివరామకృష్ణ, ఆర్ ఎస్ ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.