తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్, తెలుగునాడు సమితి ఆధ్వర్యంలో
హైదరాబాద్ :
ప్రజా భాషా ప్రస్థానానికి పునాది వేసిన మహాకవి, మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని శుక్రవారం ఉదయం చర్లపల్లి ఈసీ నగర్ లోని కృపా నికేతన్ పాఠశాలలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం పూర్తి గ్రూప్, తెలుగునాడు సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఆగస్టు 29న ప్రతి సంవత్సరం జరుపుకునే తెలుగు భాష దినోత్సవం వేడుకలు నేడు కృపా నికేతన్ పాఠశాల కరస్పాండెంట్ శరత్ సుదర్శి అధ్యక్షతన వైభవంగా జరిగాయి.
ఈ సభలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ నాయకులు జె శ్రీమన్నారాయణ మాట్లాడుతూ
గిడుగు రామమూర్తి జీవిత విశేషాలను, ఆయన గ్రాంధిక భాషకు వ్యతిరేకంగా వ్యవహారిక తెలుగు భాషా అమలుకై చేసిన పోరాటం గురించి వివరించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు చేసిన “వ్యావహారిక భాషా ఉద్యమం”ను స్మరించుకొని, ఆయన కృషితో తెలుగు భాష సాధారణ ప్రజలకు మరింత చేరువైందని వివరించారు.

స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ గిడుగు తెలుగు భాషా పరిరక్షణకు చేసిన కృషి, ప్రజల వాడుక భాషలో రచనలు చేసిన గురజాడ అప్పారావు, వేమన పద్యాల విశిష్టతను వివరించారు. “గిడుగు రామమూర్తి పంతులు చేసిన కృషి ద్వారానే తెలుగు భాష ప్రజలతో ఇంతగా కలిసిపోయందని” ఆయన పేర్కొన్నారు.

తెలుగునాడు సమితి అధ్యక్షుడు గుమ్మడి హరిప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు తెలుగునాడు సమితి చేస్తున్న కృషిని వివరించారు. తెలుగు భాష గొప్పదనాన్ని విద్యార్థులు తెలుసుకొని భవిష్యత్ తరాలకు అందించాలని అయన కోరారు.

ధరణి తెలుగు దినపత్రిక ఎడిటర్ జి రోజా రాణి మాట్లాడుతూ మన మాతృభాష అయినటువంటి తెలుగు భాష ఎంతో ఉన్నతమైనదని, తెలుగు భాషలో విద్యను అభ్యసిస్తే త్వరగా అవగతం చేసుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కృపా నికేతన్ స్కూల్ ప్రిన్సిపాల్ సుదర్శి కృపా , వైస్ ప్రిన్సిపాల్ తానియా, ఉపాధ్యాయులు రిటా మిశ్రా, అర్జున్, శ్రావణి, కిరణ్ కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.