పెళ్లింట్లో విషాదం

Facebook
X
LinkedIn

కూతురిని అత్తారింటికి పంపే వేళ తల్లి ఆకస్మిక మృతి

భద్రాద్రి కొత్తగూడెం :

ఆనంద వేడుకల మధ్య ఓ ఇంటికి విషాదం అలుముకుంది. కూతురి పెళ్లి ఘనంగా జరిపించిన తల్లి.. అప్పగింతల సమయంలో హఠాత్తుగా కుప్పకూలి మృతిచెందింది. ఈ ఘటన జిల్లాలోని కామేపురం మండలం అబ్బాసుపురం తండాలో చోటుచేసుకుంది.

అక్కడి నివాసి బానోతు మోహన్‌లాల్‌, కల్యాణి దంపతులు తమ పెద్ద కుమార్తె సింధును టేకులపల్లి మండలం కొత్తతండాకు చెందిన యువకుడికి ఆదివారం పెళ్లి చేశారు. వివాహ వేడుకలు సంతోషంగా ముగిశాయి. అయితే సాయంత్రం అప్పగింతల సమయంలో తల్లి కల్యాణి తీవ్ర భావోద్వేగానికి లోనై అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

తల్లి మృతి వార్త తెలిసి పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కొత్త వధువు తల్లి మృతితో విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. బంధువులు, గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు.