శ్రీరామసాగర్‌కి జలకళ.. భారీగా వచ్చి చేరిన వరద నీరు

Facebook
X
LinkedIn

       ప్రాజక్ట్‌లోకి 89,466 వేల క్యూసెక్కుల వరదనీరు

మెండోరా :

ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచిన శ్రీ రామసాగర్ ప్రాజెక్టు   ఎగువన గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర బాబ్లీ, విష్ణుపురి, మాలేగావ్ ప్రాజెక్టుల నుండి ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి 89,466 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.501 టిఎంసిలు ఉండగా శనివారం మధ్యాహ్నం వరకు 1082.30 అడుగులు 51.659 టిఎంసిలుగా ఉందని ప్రాజెక్టు ఎ.ఇ.ఇ.రవి తెలిపారు. ప్రధాన కాలువ కాకతీయ ద్వారా 4,625 వేల క్యూసెక్కులు, మంచి నీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, అలీ సాగర్ ఎత్తిపోతల పథకానికి 180 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 541 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు.గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1081.10 అడుగులు 48.071 టిఎంసిలుగా ఉందని.. జూన్ 1 నుండి ఇప్పటివరకు 46.930 టిఎంసిల నీరు వచ్చి చేరిందని వివరించారు. జూన్ 1 నుండి ఇప్పటివరకు 8.937 టిఎంసీ ల నీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు.కాగా గోదావరి నది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.గోదావరి నదిలో భారీగా వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.చక్రపాణి తెలిపారు.