ఆగస్టు 14 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొట్టే అవకాశం
ఉం తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ వేదికగా ప్రకటన
హైదరాబాద్ :
తెలంగాణను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత వారం పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా, గోదావరి నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు కూడా వరద పోటెత్తింది. హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండలా మారింది. ఈ జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలు ఇలానే వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆగస్టు 14 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొట్టే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో కూడా ఆగస్టు 14 నుంచి 17 వరకు వానలు దంచికొట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో ఒకట్రెండు రోజులు మాత్రం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.పంద్రాగస్టు రోజున తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ రోజున పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యే విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు అలర్ట్‌గా ఉండి, వర్షానికి బయటకు వెళ్లకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.