సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌.. సమ్మె నోటీసు

Facebook
X
LinkedIn

హైదరాబాద్‌ :

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మళ్లీ సమ్మె శబ్దం మోగింది. వేతనాల పెంపు కోరుతూ సినీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 5) నుంచి టాలీవుడ్‌లోని అన్ని సినిమా షూటింగ్‌లు నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు విధులకు హాజరుకాబోమని తెలుగు ఫిలింఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ తేల్చిచెప్పింది.

ఫెడరేషన్‌ నాయకులు శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘కార్మికుల వేతనాలను తక్షణమే 30 శాతం పెంచాలి. అలాగే పెరిగిన వేతనాన్ని ప్రతి రోజూ ఆ రోజే చెల్లించేలా నిబంధనలు అమలు చేయాలి. ఈ షరతులకు అంగీకరించిన నిర్మాతల చిత్రాల పనుల్లోనే పాల్గొంటాం’’ అని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్‌కు అధికారికంగా సమ్మె నోటీసు ఇచ్చారు.

పలు దఫాల చర్చలు ఫలితం లేకుండాపోయిన నేపథ్యంలో సమ్మె దిశగా అడుగులు ముందేసినట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు.
‘‘నిత్యావసర ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుత వేతనాలతో జీవించలేము. వేతనాల పెంపు ఇప్పుడు అవసరం కాదు.. తప్పనిసరి’’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు భారీ బడ్జెట్ చిత్రాలు, సీరియల్స్ షూటింగ్‌లో ఉండగా.. ఈ సమ్మెతో పనులు నిలిచిపోవడం ఖాయం. అంతేకాదు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు షూటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సినీ వర్గాల్లో ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. సమ్మె కారణంగా నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశముంది. దీనిపై త్వరలోనే నిర్మాతల మండలి, ఫెడరేషన్‌ మధ్య చర్చలు జరగనున్నట్టు సమాచారం.