మ్యారేజి బ్యూరోలతోనే మూడు ముళ్ళు …ఏడు అడుగులు
శ్రావణమాసం రతో ప్రారంభమైన పెళ్ళిళ్ళ సందడి
యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట : ఆధునిక సమాజంలో మార్పులు.. పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి .84 కోట్ల జీవరాసులలో మానవజన్మ అత్యుత్తమమైనది అంటారు. పురుషునిలో సగభాగం స్త్రీ అయితే, స్త్రీలో కూడా సగభాగం పురుషుడే అవుతాడు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్ళికి ముందు.. పెళ్లి తర్వాత అని చూడాల్సి వస్తోంది. ఒకప్పుడు సాధారణంగా బంధువులు ,స్నేహితులు వివాహ సంబంధాలు చూసేవారు.. కానీ ..కాలం మారింది. పేద ,మధ్య తరగతి ,కోటీశ్వరుడు అయినా సరే తమ తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే ఈనాడు విధిగా మ్యారేజ్ బ్యూరోలను సంప్రదించాల్సిందే. ఈ సాంకేతిక యుగంలో ఆశలు ,ఆకాంక్షలు, కోరికలు ,అభిరుచులు భిన్నంగా ఉంటున్నాయి. దీంతో పెద్దలు సంబంధాలు చూసినప్పటికీ తమ పిల్లలు సంపూర్ణంగా అంగీకరిస్తే నే తప్ప పెళ్లిళ్లు చేయడం లేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన స్త్రీ పురుషులు వివాహ బంధంతో ఒక్కటి అవుతున్నారు. పరస్పరం ప్రేమలు ,సమ్మతితోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందుకే కళ్యాణం… కమనీయం… జీవితం అంటున్నారు. కులాంతర మతాంతర వివాహాలు జరుగుతున్నప్పటికీ, అత్యధిక శాతం ఇంకా స్వీయ కులం వారిని చూసుకొని సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఒకప్పుడు స్త్రీ వంటింటికే పరిమితం అయ్యేది. ఈనాడు మహిళా సాధికారత పెరిగింది. చదువులో.. ఉద్యోగంలో.. నైపుణ్యంలో మగవారికి దీటుగా మహిళలు రాణిస్తున్నారు. ఉద్యోగం స్త్రీపురుషులకు సమానంగా మారింది. ఇద్దరు పని చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి ఏర్పడింది. దీంతో జాగ్రత్తగా సంబంధాలను యువత వెతుక్కుంటున్నారు. ఇక తమ పిల్లల బయోడేటాలు ,ఫోటోలు చదువు, ఉద్యోగం, నెలసరి జీతం, ఆస్తిపాస్తులు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు …వారేం చేస్తున్నారు …అనే సమాచారంతోపాటు సాంప్రదాయబద్ధంగా రాశులు ,నక్షత్రాలు, గోత్రాలు కూడా చూసుకుంటున్నారు. సరి అయిన ఉద్యోగం దొరక్క కొంతమంది… సరియైన జోడి దొరక్క మరి కొంతమంది వయస్సు దాటిపోతుంది. దాదాపుగా అన్ని లేటు పెళ్లిళ్లుగా మారుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. సరైన జీవిత భాగస్వామి లభించడం పూర్వజన్మ సుకృతమే. చదివించలేం, పోషించలేము ,కట్నాలు కానుకలు ఇవ్వలేం.. అని ఆడబిడ్డలను కనా లంటేనే భయపడే స్థితి నుంచి …కంటే ఆడపిల్లనే కనాలి అనే స్థితికి పరిస్థితికి ప్రస్తుతం మారింది. ఒకప్పుడు కన్యాశుల్కం నుండి వరకట్నం వరకు మారింది. ఈ రోజుల్లో మళ్లీ కన్యాశుల్కం పునరావృతం అయ్యిందనే భావన వ్యక్తం అవుతుంది. అమ్మాయిలు ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా…ఉద్యోగాలు చేస్తున్నా సరే …ఉద్యోగాలు చేసే అమ్మాయి మాకు వద్దు.. వంట పని చేసుకుని ఇంటిని చూసుకుంటే చాలు… అని కొంతమంది అంటుండేవారు.. మారిన పరిస్థితి లలో ఈరోజు గొప్ప చదువులు చదువుకొని …అత్యధిక జీతం వచ్చే ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయి కైనా.. అమ్మాయి కైనా మంచి డిమాండ్ కనిపిస్తోంది. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగమే కాదు, గొప్ప జీవిత భాగస్వామి కూడా లభిస్తుంది. అందుకే పెళ్లిళ్ల విషయంలో పిల్లల తల్లిదండ్రులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిల్లలు కూడా పెద్దల సూచనలను పరిగణ లోకి తీసుకొని నచ్చిన వారిని ఎంచుకుంటున్నారు. మొత్తం పైన సమాజంలో మ్యారేజ్ బ్యూరోలే పెళ్లిళ్ల పేరయ్యలు. చట్టరీత్యా యుక్త వయస్సు వచ్చిన వారికి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మనసారా కోరుకుందాం పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కని అష్ట ఐశ్వర్యాలతో మంచి ఆరోగ్యంతో తులతూగాలని పెద్దలుగా మనసారా పిల్లలను ఆశీర్వదిద్దాం.