– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
హైదరాబాద్ :
చర్లపల్లి బీపీసీఎల్ యూనిట్ లో డ్రైవర్లు, హెల్పర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. డ్రైవర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక రవాణా కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో న్యాయం జరగాలని, కనీస వేతనం రూ.26,000, నైపుణ్య కార్మికులకు రూ.36,000 చెల్లించాలన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్, హెల్త్ పాలసీ, ప్రమాద భీమా, విద్యా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. డ్రైవర్లపై భారీ జరిమానాలు, శిక్షలు అన్యాయమని, మోటారు వాహనాల చట్టాన్ని న్యాయంగా అమలు చేయాలని అన్నారు. జూలై 9 కార్మిక సమ్మె విజయవంతమైందని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బీపీసీఎల్ డ్రైవర్లు, హెల్పర్లు సీఐటీయూ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం. ఐక్యంగా పోరాడితేనే హక్కులు సాధ్యం అవుతాయని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడుఎర్ర అశోక్అన్నారు.
ఒక్కడొక్కడిగా కాకుండా ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. అవసరమైతే ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
12 గంటల పనివిధానం అన్యాయం. 8 గంటల పని విధానాన్ని పాటించాలి. జీవో 282ని తక్షణం రద్దు చేయాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు జి. శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
సభకు తెలంగాణ పెట్రోల్ లియం చర్లపల్లి యూనిట్ అధ్యక్షుడు పి.గణేష్ అధ్యక్షతన వహించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మేడ్చల్ జిల్లా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్. బాధ్యుడు బంగారు నర్సింగరావు, చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు బివి.సత్యనారాయణ, డంపింగ్ యార్డ్ హెచ్ ఐ ఎం ఎస్ డబ్ల్యూ యూనియన్ ప్రధాన కార్యదర్శి రమేష్, చర్లపల్లి బీపీసీఎల్ యూనిట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు షరీఫ్, మల్లేష్ , సంయుక్త కార్యదర్శులు ఆంజనేయులు నాగస్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి రాజిరెడ్డి, కోశాధికారి చెన్నకేశవులు, సభ్యులు మహేష్, రాజారెడ్డి, ఖాజ, కుమారస్వామి, నాగరాజు, గంగాధర్ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.