సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవానికి దూరం…

Facebook
X
LinkedIn

మిస్ వరల్డ్ పోటీలపై భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల ప్రభావం

హైదరాబాద్ :
భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం, ప్రపంచ స్థాయి అందాల పోటీలైన 72వ మిస్ వరల్డ్ – 2025 పోటీలపై కూడా పడింది. ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం వేదికగా ఈ పోటీలు ప్రారంభంకానుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం లేదని సీఎంఓ వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ప్రాంతీయ భద్రతా పరిస్థితులు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి స్వయంగా దూరంగా ఉండటంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోటీలకు విచ్చేసే అతిథులకు ఇవ్వాల్సిన డిన్నర్ పార్టీని కూడా రద్దు చేసినట్టు సమాచారం.

ఇటీవల భారత్-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, ప్రతిపక్షాలు ఈ పోటీల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పోటీలను వాయిదా వేయాలన్నా, రద్దు చేయాలన్నా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విమాన సర్వీసుల రద్దు, మార్పులు కూడా పోటీదారుల రాకపోకలపై ప్రభావం చూపవచ్చు.

భద్రతే ప్రధాన సవాలు

ఈ పోటీల్లో 120 దేశాల నుంచి వచ్చే అందాలవనితలు, స్పాన్సర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు భద్రత కల్పించడం పోలీసు శాఖకు ప్రధాన సవాలుగా మారింది. మూడు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వాస్తవంగా భారీ భద్రతా ఏర్పాట్లు అవసరం.

హైదరాబాద్ నగరంలోని వ్యూహాత్మక ప్రదేశాలు, విమానాశ్రయాలు, హోటల్స్ పరిసరాల్లో ఇప్పటికే పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, సాధారణ ప్రజల భద్రతకు భంగం కలుగకుండా ఎలా నిర్వహించాలో అనే అంశంపై అధికారులు తలపోటు పడుతున్నారు.

అంతర్జాతీయ గుర్తింపు – స్థానిక ఆందోళనలు

ఈ పోటీలు తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్నది కాలమే చెబుతుంది.