నాణ్యతల లోపాలతో డొల్లబడిన చర్లపల్లి రైల్వే టెర్మినల్

Facebook
X
LinkedIn

సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం

ప్రజాధన దుర్వినియోగం పై చర్లపల్లి రైల్వే స్టేషన్ ముందు సిపిఎం నిరసన

వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి

తెలుగునాడు, హైదరాబాద్ :

చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్‌ను కోట్లాది రూపాయల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించినట్లు అధికారులు చెబుతున్నా, నిజంగా అక్కడ నిర్మాణ నాణ్యత తీవ్రంగా సందేహాస్పదంగా ఉంది. ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ మేడ్చల్ జిల్లా సిపిఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యదర్శి పి.సత్యం నాయకత్వంలో స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. సోమవారం చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎదుట శనివారం కురిసిన చిన్న వర్షానికి రైల్వే స్టేషన్ ప్రధాన టెర్మినల్ భవనం లోపాలు బయటపడటంతో రైల్వే అధికారులపై విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. మూడు నెలల క్రితమే ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ స్టేషన్‌కు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం భారీ వ్యయంతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టబడినట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి చెబుతుండగా, మరోవైపు నిర్మాణాల్లో ఇటువంటి లోపాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది అన్నారు.

కానీ అల్పమాత్ర వర్షానికే ప్రధాన టెర్మినల్ భవనం లోపాలు బయటపడటంతో నిర్మాణ నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికుల భద్రతకు ఇది ప్రమాదకరమని, వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె.చంద్రశేఖర్, ఎర్ర అశోక్, జి.శ్రీనివాసులు, ఐలాపురం రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యుడు జె. వెంకన్న నాయకులు గణేష్, చంద్రశేఖర్, కార్తీక్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.