న్యాయవాదుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి శ్రీధర్ బాబు

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

న్యాయవాదుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం నాడు లక్డీకాపూల్ లోని ఓ హోటల్ లో జరిగిన అడ్వొకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ రజతోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయవాదుల భద్రత కోసం ఇటీవలే ‘ప్రొటెక్షన్ యాక్టు’ను చట్టం చేసామని శ్రీధర్ బాబు వెల్లడించారు. త్వరలోనే దానిని అమలులోకి తెస్తామని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయించే విషయమై న్యాయశాఖను కూడా నిర్వహిస్తున్న సిఎం రేవంత్ రెడ్డిని కోరతామని ఆయన భరోసా ఇచ్చారు. వెయ్యి కోట్ల డిపాజిట్లతో న్యాయవాదుల సొసైటీ ఆర్థికంగా తమ ప్రభత్వం కంటే బలంగా ఉందని ఆయన చమత్కరించారు. అనారోగ్యం పాలైన వారికి, చనిపోయిన లాయర్ల కుటుంబాలకు సొసైటీ అండగా నిలుస్తుండటాన్ని శ్రీధర్ బాబు ప్రశంసించారు. తాను కొన్ని అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని లేకపోతే హైకోర్టులో అడ్వొకేట్ గా ప్రాక్టీసు చేస్తుండేవాడినని అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేసిన తర్వాత అక్కడి తీస్ హజారీ కోర్టుల్లో కొన్నాళ్లు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో మూడేళ్లు ప్రాక్టీసు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

సహచర ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్ (అంబర్ పేట), జి.మధుసూదన్ రెడ్డి (దేవరకద్ర)లతో కలిసి న్యాయవాదుల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ నం. 28 కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తామని తెలిపారు. అంతకు ముందు ఆయన ఎమ్మెల్యేలతో కలిసి సొసైటీ సిల్వర్ జూబ్లీ సావనీర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపక సభ్యులు సునీల్ గాను, అధ్యక్షుడు శ్రీనాథ్, కార్యదర్శి శ్రీధర్ తదితరులు ప్రసంగించారు. సీనియర్ అడ్వొకేట్లు, బార్ అసోసియన్ల ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.