ఉల్లాసభరితంగా కొనసాగుతున్న జనవిజ్ఞాన వేదిక వేసవి సైన్స్ శిబిరం
తెలుగునాడు హైదరాబాద్ :
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి సైన్స్ శిబిరం విద్యార్థుల ఉత్సాహంతో ఉల్లాసభరితంగా కొనసాగుతోంది. శిబిరంలో రెండవ రోజు శుక్రవారం ప్రముఖ విజ్ఞానవేత్త శివకుమార్ “మాయాజాలాల వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలు” అనే అంశంపై ఆసక్తికరమైన ప్రదర్శన నిర్వహించారు.
మూఢనమ్మకాలు సమాజంలో వేగంగా వ్యాపిస్తున్న ఈ తరుణంలో, ప్రజలను మోసం చేయడానికి కొందరు చిన్న చిన్న ట్రిక్కులను ‘మహిమలు’గా ప్రదర్శిస్తున్నారని శివకుమార్ తెలిపారు. నిజానికి అలాంటి అద్భుతాల వెనుక శాస్త్రమే ఉందని, ఆ లాజిక్కులను అందరికీ అర్థమయ్యే భాషలో వివరిస్తూ విద్యార్థుల్లో విమర్శనాత్మక దృష్టిని పెంపొందించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా కోశాధికారి జెన్ని, కాప్రా మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నాయకులు పిట్టల నాగరాజు, శివ శంకర్ రెడ్డి, తాహిర్ పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ శిబిరంలో చురుకుగా పాల్గొని శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించుకున్నారు.

ఈ వేసవి శిక్షణ శిబిరం శ్రీ చక్రి విద్యా నికేతన్ హై స్కూల్ చక్రిపురంలో ఈనెల 24వ తారీఖు నుండి వచ్చేనెల నాలుగో తారీఖు వరకు ఈ శిబిరం నిర్వహిస్తారు.