మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలుగునాడు, హైదరాబాద్ :
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సందర్భంగా చోటుచేసుకున్న అవకతవకలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పలు పత్రికలలో ప్రచురితమైన కథనాలపై స్పందించిన మంత్రి , సంబంధిత అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ అవకతవకలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులను పిలిపించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో విజిలెన్స్ విచారణ చేపడుతున్నారని మంత్రి గారు తెలిపారు. విజిలెన్స్ ఇచ్చే విచారణ నివేదిక ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిగారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, విజిలెన్స్ విచారణను వేగంగా పూర్తి చేసి, రిపోర్టును సమర్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి, మార్కెటింగ్ డైరెక్టర్ కి ఆదేశాలిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి మార్కెటింగ్ సెక్రటరీ, జిల్లా మార్కెటింగ్ అధికారుల నుండి వివరణ తెప్పించుకోవాలని మార్కెటింగ్ డైరెక్టర్ కి మంత్రి ఆదేశించారు. మార్కెట్లలో జరిగే ఎలాంటి అక్రమాలను ప్రభుత్వం ఉపేక్షించదని, రైతులకు నష్టం కలిగే విధంగా ఎవరూ నడుచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.