హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లోని నోవాటెల్ హోటల్‌లో 25, 26 తేదీల్లో భారత్ సదస్సు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ
100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు
రాహుల్‌గాంధీ, ఖర్గే కీలకోపన్యాసం
నేడు హైదరాబాద్ డిక్లరేషన్ ఆవిష్కరణ
తెలుగునాడు, హైదరాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 25, 26 తేదీల్లో ‘భారత్ సదస్సు-2025’ నిర్వహించనుంది. ఈ సదస్సులో 100కు పైగా దేశాల నుండి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు భారత్ సమ్మిట్ 2025. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 25, 26 తేదీల్లో’భారత్ సదస్సు-2025′ నిర్వహించనుంది. ఈ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతేకాక 100కు పైగా ప్రగతిశీల రాజకీయ పార్టీలు, 40 నుంచి 50 మంది వరకు మంత్రులు, మరో 50 మంది వరకు ఎంపీలు, సెనేటర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే తాజాగా భారత్ సమ్మిట్ 2025 కు తగిన ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ చేసింది. ప్రపంచానికి దారి చూపేలా భారత్ సమ్మిట్ 2025 అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక హైదరాబాద్ వేదికగా నిర్వహించబోయే భారత్ సమ్మిట్ 2025 అనేది చరిత్రలో నిలిచిపోతుందని తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భట్టి అన్నారు. సమ్మిట్ నిర్ణయాలను తెలంగాణలో అమలు చేస్తామని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేస్తామని తెలిపారు.

హైదరాబాద్ డిక్లరేషన్ ఆవిష్కరణ : సదస్సులో అంతర్జాతీయ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం వంటి అంశాలపై ఉన్నత స్థాయి ద్వైపాక్షిక, సైద్ధాంతిక చర్చలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. 25న ‘హైదరబాద్ డిక్లరేషన్’ను ఆవిష్కరించనున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలకోపన్యాసం చేయనున్నారు. ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ప్రసంగిస్తారు. అర్జెంటినా విదేశాంగ మాజీ మంత్రి జోర్జ్ టయానా, కొలంబియా కార్మిక శాఖ మాజీ మంత్రి, సెనేటర్ క్లారా లోపెజ్ ఓబ్రెగాన్, స్వీడన్ విదేశాంగ మాజీ మంత్రి అన్ లిండె, క్యూబా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల హెడ్ ఎమిలియో లొజాడా, మలేషియా న్యాయ శాఖ మంత్రి ఎం.కుల సేగరన్‌లతో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు దిగ్విజయ్ సింగ్, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనాటె, సల్మాన్ ఖుర్షీద్, జ్యోతిమణి తదితరులు సదస్సుకు హాజరు కానున్నారు.
తొలిసారిగా సదస్సు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు కావడం, అలీన ఉద్యమానికి బీజాలు వేసిన బాండుంగ్ సదస్సు 70వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు రోజుల భారత్ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామికంగా పెను మార్పులు సంభవిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తుందన్నారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ స్వప్నమైన ‘న్యాయ్’ను ప్రతిబింబించేలా ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై చర్చలు ఉంటాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ పై కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివరిస్తామని తెలిపారు.