సూర్యుడు ప్రతాపం నిజామాబాద్ లో రికార్డ్ స్థాయి 45 డిగ్రీలు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :


రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోయారు. వడగాల్పులు, ఉక్కపోతతో సతమతం అయ్యారు. బుధవారం నిజామాబాద్ లో ఏకంగా రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ లో 45.3 డిగ్రీలు, అదిలాబాద్ 45.2, నిర్మల్ 45.1, మంచిర్యాల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇదే మొదటిసారి. ఇక రాష్ట్ర రాజధానిలో కూడా ఎండ ప్రతాపం చూపించింది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగర వాసులు ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రానున్న మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్టు వాతావరణకేంద్రం అధికారులు పేర్కొన్నారు. అత్యవసరం అయితే తప్ప పగలు బయటికి రావొద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.


మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ రానున్న 3 రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువ ఉండనుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు ఉండనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పగటి సమయంలో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. ఇక సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉందని తెలియజేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే ఎల్లుండి మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.