విద్యార్ధినులపై లాటీచార్జి చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇంత జరుతున్నా మహిళాకమీషన్ ఏమి చేస్తుందని ప్రశ్నించిన జిల్లాకార్యదర్శి ఎం వినోద
తెలుగునాడు, కాప్రా :
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద, చదువు కుంటున్న విద్యార్ధినుల మీద యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని ఐద్వా మేడ్చల్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వినోద తెలిపారు. విద్యార్థి నాయకులను, చదువుకునే విద్యార్ధినులపై అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ చేసారు. వీరిని తక్షణమే విడుదల చేయాలని, 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేశారు. విద్యార్ధినులపై దాడిచేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఈ పోరాటంలో పాల్గొంటామని తెలిపారు. ఇటువంటి చర్యలు జరుగుతుంటే మహిళా కమీషన్ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. మగ పోలీసులు విద్యార్ధినులను విచక్షణా రహితంగా ప్రవర్తించారు. ఇది సమాజానికి సిగ్గుచేటని ఆమెఅన్నారు. విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుని అమ్మకానికి పెట్టింది. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ నాయకత్వంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారు. ఉన్నట్టుండి నిన్న పెద్ద ఎత్తున పోలీసులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తూర్పు క్యాంపస్‌లోకి బుల్డోజర్లతో ప్రవేశించారు. ప్రభుత్వం ఎంపిక చేసిన 400 ఎకరాల స్థలం దాటి తూర్పు క్యాంపస్ స్థలంలో కూడా చదును చేయడం మొదలుపెట్టారు. ఇది సరైందికాదని ప్రశ్నించిన విద్యార్థులను 60 మందిని అమ్మాయిలతో సహా అరెస్టు చేసి రాత్రి 10 గంటల వరకు మాదాపూర్, రాయ్‌దుర్గ్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లల్లో నిర్బంధించారు. పోలీసుల దాడిలో ఒక విద్యార్థి తల పగిలింది. అమ్మాయిల బట్టలు చింపారు. రక్తాలు కారే విధంగా గీరారు. ఈ దర్మార్గ చర్యలను వెంటనే ఆపాలని ఐద్వా మేడ్చల్‌జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వినోదా డిమాండ్ చేశారు.