జర్నలిస్టుల సంక్షేమ హామీలు అమలు చేయాలి

Facebook
X
LinkedIn

టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా

హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు, గృహ స్థలాల హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసిన జర్నలిస్టులు

మేడ్చల్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన సంక్షేమ హామీలను తక్షణమే అమలు చేయాలని, మీడియా స్వేచ్ఛను పరిరక్షించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నినదిస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

ధర్నాలో పాల్గొన్న జర్నలిస్టులు “అమలు కాని హామీలు వెంటనే అమలు చేయాలి”, “అర్హులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి”, “జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించొద్దు” అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.కె. సలీమా, గుమ్మడి హరిప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి బనావత్ రవి నాయక్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం గతంలో ప్రకటించిన పలు హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ముఖ్యంగా అర్హులైన విలేకరులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు.

జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థులైన జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల, కళాశాల ఫీజుల్లో రాయితీలు కల్పిస్తామని చెప్పిన హామీ కూడా అమలుకాలేదని పేర్కొన్నారు. అదేవిధంగా ఇండ్ల స్థలాల కేటాయింపు, గృహ నిర్మాణ పథకాల అమలు, జర్నలిస్టుల సంక్షేమ నిధి బలోపేతం వంటి అంశాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పత్రికా రంగం ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని, అలాంటి రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు కనీస భద్రతా సౌకర్యాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాలపరిమితిలో అమలు చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అవసరమైతే దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

అనంతరం జర్నలిస్టుల సమస్యలను వివరించిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా, నియోజకవర్గ ఇన్‌చార్జులు, వివిధ మండలాల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు సహా పెద్ద సంఖ్యలో విలేకరులు పాల్గొన్నారు.