రైజింగ్ దిశగా అడుగులేస్తున్న తెలంగాణ

Facebook
X
LinkedIn

*2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం

*ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోంది

*ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిహెచ్ఎంసి విభజన

*ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి ప్రసంగం

హైదరాబాద్ :

దేశానికి దిక్సూచీగా మన రాష్ట్రం నిలుస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కొనియాడారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి ప్రసంగం చేశారు. తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులేస్తున్నామని, శ్రమించే తత్వంగల శాంతికాముకులు తెలంగాణ ప్రజలు అని తెలియజేశారు. తెలంగాణ పురోగతిలో ప్రతీపౌరుడు భాగస్వామి అని..ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని, ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అందరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని, జిహెచ్ఎంసిని మూడు కార్పొరేషన్లుగా, కోర్,ప్యూర్, రేర్ గా తెలంగాణను విభజించామని గవర్నర్ పేర్కొన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిహెచ్ఎంసి విభజన చేశామని, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించేలా 4 కమిషనరేట్లు ఏర్పాటు చేశామని అన్నారు. హిల్ట్ పాలసీతో పరిశ్రమ భూముల బదలాయింపు జరిగిందని, మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి చేశామని గవర్నర్ అన్నారు. మూసీలో మురుగునీరు చేరకుండా 39 ఎస్టిపిలు నిర్మాణం జరిగిందని, ఒఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కు అనుబంధంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తామని అన్నారు. 55కి.మీ. మేర మూసీని పునరుజ్జీవింప చేస్తామని, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్ ప్రెస్ వే, బుల్లెట్ ట్రైన్ కు శంషాబాద్ కు కేంద్రంగా మారబోతోందని గవర్నర్ పేర్కొన్నారు. వరంగల్, అదిలాబాద్ కు ఎయిర్ పోర్టులు రాబోతున్నాయని, గ్లోబల్ సమ్మిట్ తో రూ. 5 లక్షల 72 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణను అభివృద్ధిలో గ్లోబల్ హబ్ గా మార్చాలనుకుంటున్నామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో బిఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభలో నిలబడే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగాన్నితిలకించారు.