ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో కవిత

Facebook
X
LinkedIn

హైదరాబాద్‌ :
బీఆర్ఎస్‌లో రాజకీయ కలకలం రేగింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ అనూహ్య పరిణామం బుధవారం వెలుగులోకి వచ్చింది. పార్టీ నుంచి తాను వేరుపడిన వెంటనే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో కవిత ఉన్నట్లు సమాచారం. తాను చేపట్టబోయే భవిష్యత్‌ కార్యాచరణపై బుధవారం కీలక ప్రకటన చేయనున్నారు.

కవిత సస్పెన్షన్ వార్తతో ఆమె నివాసం వద్ద మద్దతుదారులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు గుమికూడారు. కవితకు సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేశారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలకు వ్యతిరేకంగా ఘోషణలు చేశారు. ఈ పరిణామం బీఆర్ఎస్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.

గత కొంతకాలంగా కవిత పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బహిరంగ మద్దతు ఇవ్వడం, సింగరేణి కార్మిక సంఘంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కొప్పుల ఈశ్వర్‌ ఎన్నికను వ్యతిరేకించడం, తెలంగాణ జాగృతి వేదికగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం… ఈ పరిణామాలు సస్పెన్షన్‌కు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కవిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. హరీశ్ రావు, సంతోష్ ల వల్లే కేసీఆర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె బహిరంగంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణ జాగృతి వేదికగా కొత్త రాజకీయ ప్రయాణం మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని కవిత మద్దతుదారులు చెబుతున్నారు.