రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటా మొత్తాన్ని పూర్తిగా సరఫరా చేయండి

Facebook
X
LinkedIn

ఆర్ఎఫ్సిఎల్   సీఈఓ తెలంగాణ ఎన్ఎఫ్సిఎల్  సేల్స్ మేనేజర్ లతో మంత్రి తుమ్మల సమావేశం

హైదరాబాద్ :

ఆర్ఎఫ్సిఎల్   సీఈఓ   అలోక్ సింగాల్ మరియు తెలంగాణ ఎన్ఎఫ్సిఎల్  సేల్స్ మేనేజర్, రాజేశ్ లతో సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ – రాష్ట్రానికి ఆర్ఎఫ్సిఎల్ నుండి రావలసిన యూరియా కోటాలో ఇంకా 62,473 మెట్రిక్ టన్నులు అందలేదని ఆర్ఎఫ్సిఎల్ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి సరఫరా ఆలస్యమవ్వడంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని మంత్రిగారు తెలిపారు. రైతుల పంటలపై ప్రతికూల ప్రభావం పడకముందే, రాష్ట్రానికి రావాల్సిన యూరియా సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రిగారు కోరారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటా మొత్తాన్ని పూర్తిగా సరఫరా చేయాలని మంత్రిగారు స్పష్టం చేశారు. ముందుగా కనీసం 50 శాతం యూరియాను ఈ వారంలోనే ఆర్ఎఫ్సిఎల్ నుండి గాని, ఎన్ఎఫ్సిఎల్  నుండి గాని రాష్ట్రానికి పంపేలా చూడాలని ఆయన సూచించారు. రైతులకు అసౌకర్యం కలగకుండా ఎరువుల పంపిణీ తక్షణమే జరగాలని మంత్రి స్పష్టం చేశారు. దీనికి స్పందించిన ఆర్ఎఫ్సిఎల్ ఎండి, రాష్ట్రానికి కావలసిన యూరియాను త్వరలోనే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల అవసరాలను తీర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 42 వేల మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందని, ఈ రోజు మరో 6543 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని మంత్రిగారు తెలిపారు. అలాగే ఈ నెల చివరి వరకు వివిధ తేదీలలో మరో 37,877 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చే అవకాశం ఉందని మంత్రిగారు అన్నారు. యూరియా సరఫరా కోసం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మంత్రిగారు పేర్కొన్నారు.