మన వాహనాలను ‘వాహన్‌’ డాటాబేస్‌లో చేర్చని వైనం

Facebook
X
LinkedIn

రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణను పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్‌ :

రాష్ట్ర రవాణా శాఖ నిర్లక్ష్యం తెలంగాణలోని వాహనదారుల పాలిట శాపంగా మారనున్నది. టోల్‌ ప్లాజా ఫీజులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘యాన్యువల్‌ టోల్‌పాస్‌ స్కీమ్‌’లో తెలంగాణ నేటికీ చేరకపోవడం రాష్ట్రంలోని వాహనదారులకు మరింత భారంగా పరిణమించనున్నది. ఈ నెల 15న ప్రారంభిచనున్న ఈ పథకంలో తెలంగాణ మినహా మిగతా రాష్ర్టాలన్నీ చేరాయి. ఈ పథకం కింద కారు, జీప్‌, వ్యాన్‌ తదితర వాణిజ్యేతర వాహనదారులు ఏడాదికి రూ.3 వేలు చెల్లించి ‘ఫాస్టాగ్‌’ ఆధారిత టోల్‌పాస్‌ను తీసుకుంటే జాతీయ రహదారులపై 200 సార్లు టోల్‌-ఫ్రీ క్రాసింగ్‌లను అనుమతిస్తారు. ఆ తర్వాత 200 క్రాసింగ్‌లు పూర్తయితే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

కేంద్రం 3 నెలల క్రితమే వివరణ కోరినా..

దేశంలోని అన్ని రాష్ర్టాలు టోల్‌పాస్‌ పథకంలో చేరినప్పటికీ తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి వీ ఉమాశంకర్‌ ఈ ఏడాది మే నెలలో తెలంగాణ చీఫ్‌ సెక్రటరీతోపాటు రాష్ట్ర రవాణాశాఖ అధికారుల వివరణ కోరారు. తెలంగాణలోని వాహనాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘వాహన్‌ పోర్టల్‌’లోకి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు తప్పనిసరి. ఆ మైగ్రేషన్‌ ప్రక్రియ తీవ్రంగా ఆలస్యమవుతున్నది. మే నెల నుంచీ గత వారం వరకూ ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి మరోసారి తెలంగాణ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలోని వాహనాల డాటాను ‘వాహన్‌ పోర్టల్‌’కు తరలించే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా రహదారి వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ నుంచి అధికారిక జోక్యం అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పథకం నుంచి రాష్ర్టాన్ని పక్కనపెట్టినట్టు తెలిసింది.ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి తోడు సాంకేతిక సిబ్బంది కొరత, వాహన రిజిస్ట్రేషన్‌ డాటా అసంపూర్తిగా ఉండటం, పాత రికార్డులు డిజిటలైజ్‌ కాకపోవడం తదితర సమస్యలతో రాష్ట్ర రవాణాశాఖ సతమతమవుతున్నది. తెలంగాణలోని వాణిజ్యేతర వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు, వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సులతోపాటు రిజిస్టర్లను జాతీయ రిజిస్టర్లయిన సారథి, వాహన్‌లో విలీనం చేయడం సాంతకేతిక అంశాలతో కూడుకున్న అంశం.