జర్నలిస్టు కలం… ప్రజాస్వామ్య బలం

Facebook
X
LinkedIn

పిచ్చి మొక్కల పేరుతో తులసి మొక్కను పీకెయ్యడం సరికాడు

పీవీ నరసింహారావు ( సీనియర్ జర్నలిస్టు )

హైదరాబాద్ :

ఎక్కడైతే  స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఆనంద నాట్యం చేస్తారట… ఎక్కడైతే జర్నలిస్టు స్వేచ్ఛగా …సమాజ హితంగా పనిచేయ గలుగుతాడో అక్కడ ప్రజాస్వామ్యం , పరిఢవిల్లుతుంది. ప్రజలు సుఖశాంతులతో జీవించగలుగుతారు అని అంటుంటారు.లోక కళ్యాణమే పరమార్ధంగా వార్తలు మోసే నారదుడే కాదు… దుష్ట శిక్షణలో శిష్ట రక్షణలో శ్రీకృష్ణుడు శ్రీరాముడు… నిత్యం సమాజ హితమే ధ్యేయంగా, సంఘసంస్కర్తగా, సామాజిక సేవకుడిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ,జీతం లేకుండా 24 గంటలు పని చేస్తే కలంకార్మికుడు జర్నలిస్టు. ఎంచుకున్న వృత్తి కుటుంబాన్ని పోషించలేకున్నా… నిరంతరం పనిచేసే సామాజిక కలం కార్మికుడు జర్నలిస్టు. నచ్చిన వార్తలు వస్తే పొగడ్తలతో ముంచెత్తుతారు. నచ్చని వి వస్తే విమర్శిస్తారు.. కేసులు కూడా పెడతారు. అయినా మొక్కవోని ధైర్యంతో  ప్రజలకు అండగా ఉంటూ ముందుకు వెళ్లేవాడే జర్నలిస్టు. ప్రభుత్వం అందించే  అక్రెడిటేషన్  కార్డ్ ( గుర్తింపు) కలిగినవాడు మాత్రమే కాదు.. ప్రజలు నచ్చే.. సమాజం మేచ్చే రాతలు రాసే ప్రతివాడు జర్నలిస్టు. సమాజానికి, ప్రజాస్వామ్యానికి… శాసనమండలి, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ తర్వాత నాలుగవ మూల స్తంభం మీడియా ( ఫోర్త్ ఎస్టేట్). క్రీడా ,సాంస్కృతిక, క్రైమ్, పొలిటికల్ ,సినిమా ,ఫోటో ఇలా అనేక రంగాలలో ప్రత్యేక నైపుణ్యం గల జర్నలిస్టులు పనిచేస్తున్నారు. స్థూలంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గా పిలుచుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మీడియా ఒక చర్చా వేదికగా కూడా మారింది. పిచ్చి మొక్కల పేరుతో తులసి మొక్కను పీకెయ్య రాదు. అన్యాయానికి గురయ్యే రైతుల పట్ల, కార్మికుల పట్ల ,ఉద్యోగుల పట్ల… ఇలా ఇలా అన్ని  సమాజంలోని వర్గాలకు అండగా నిలబడే వ్యక్తి జర్నలిస్టు. తన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేసే నిస్వార్థ జీవి జర్నలిస్టు. ఆయన అడుగుతున్నది కనీస వేతనం .ఉద్యోగ భద్రత . అక్రెడిటేషన్ పేరుతో గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, ప్రయాణించేందుకు ఉచిత బస్సు పాసులు, రాయితీపై రైల్వే ప్రయాణం ,60 సంవత్సరాలు పైబడిన వృద్ధ సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్, ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలలో తమ పిల్లలకు 50% ఫీజులు మాత్రమే తీసుకోవాలని  ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు. దౌర్జన్యం చేసే వారి నుంచి కనీస రక్షణ, వృత్తి భద్రతను కోరుకుంటున్నారు.  ఇవి గొంతెమ్మ  కోరికలు కాదు. స్వేచ్ఛ, కనీస సౌకర్యాలు. జర్నలిస్టులను కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడమే.