సంక్షోభంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థప్రజా ఉద్యమాలే మార్గం..-

Facebook
X
LinkedIn

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ మేడ్చల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం

తెలుగునాడు, హైదరాబాద్ :

మతతత్వ రాజకీయాలకు కార్పొరేట్ శక్తులు మద్దతు ఇవ్వడం దేశానికి అత్యంత ప్రమాదకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ హెచ్చరించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా సిపిఎం కార్యాలయం కమలానగర్‌లో జరిగిన సిపిఎం శాఖా కార్యదర్శుల విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జె.చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ హాజరయ్యారు. ఈ సమావేశ ప్రారంభంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్‌కు నివాళి అర్పిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్ధిక వ్యవస్థను ప్రస్తావిస్తూ పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నయా ఉదారవాద విధానాలు, పెట్టుబడిదారులకు అనుకూలంగా రూపొందిన ఆర్థిక విధానాలే ఈ దుస్థితికి కారణం. అమెరికాలో కోవిడ్ అనంతర కాలంలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. నిరుద్యోగం, వలసలు పెరిగాయి. తమ ప్రయోజనాల కోసం అమెరికా యుద్ధాలను ప్రోత్సహిస్తోంది. చైనాతో వాణిజ్య యుద్ధాలు కొనసాగిస్తున్నది. భారతదేశంలోని పరిస్థితులపై మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం నయా వాద విధానాలను అమలు చేస్తూ, దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతోంది. నిజ వేతనాలు తగ్గిపోతున్నాయి. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతోంది. అమెరికాతో వ్యాపార ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులకు నష్టం కలుగుతోంది. పాలు, సోయాబీన్ దిగుమతుల కారణంగా పంటలకు ధరలు పడిపోతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల పరిస్థితులను ఉదాహరణగా చెబుతూ, “ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఆదేశాలతో ఆ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. భారత్ కూడా అదే దిశగా వెళ్లే ప్రమాదం ఉంది. ప్రజలే దీనికి ప్రతిఘటించాలి,” అని పిలుపునిచ్చారు. మతతత్వ శక్తుల కుట్రల్ని విశ్లేషిస్తూ.. పాల్గాం దాడి సందర్భంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మోడీ మౌనంగా ఉండడం అనుమానాస్పదం. హిందుత్వాన్ని ముందుకు తేవాలనే కుతంత్రమే కనిపించింది అన్నారు.భారత్ నాలుగో ఆర్థిక శక్తిగా మారుతోంది అనే మోడీ మాటలు, కేవలం కార్పొరేట్‌లకు మద్దతుగా ఉన్నవే. సామాజిక అసమానతలు పెరిగిపోతున్న దేశంలో ఇది అర్థవంతమైన వాదన కాదు. ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేసి, సహజ వనరులను కార్పొరేట్‌లకు అప్పగించేందుకు మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరుతో దాడులు చేయడం కుట్రే, అని పాలడుగు భాస్కర్ విమర్శించారు. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రజా ఉద్యమాలు, సామూహిక పోరాటాలే మార్గమని స్పష్టం చేశారు. అన్ని రంగాలలో ప్రజలతో కలిసి ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం కొనసాగించాలి. సమస్యలపై ప్రజా ఆందోళనలతో పాటు, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి అని అన్నారు.జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె.రవి మాట్లాడుతూ.. స్థానిక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి. పార్టీ కార్యకలాపాల్లో యువతను ఆకర్షించేందుకు మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఐ.రాజశేఖర్, ఎ.అశోక్, ఎం.వినోద, కమిటి సభ్యులు, సీనియర్ నాయకులు, పూర్తి కాలం కార్యకర్తలు, శాఖా కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు, ఫ్రాక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.