అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలి

Facebook
X
LinkedIn

               అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు

హైదరాబాద్‌ :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని, ఆయా సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు చేరే విధంగా తగు చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర మంత్రులు  శ్రీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీ పొన్నం ప్రభాకర్‌, శ్రీమతి కొండా సురేఖ, శ్రీ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఉదయం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో  అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, వివిధ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో భోజన, మౌలిక వసతుల ఏర్పాటు, వనమహోత్సవంలో మొక్కలు నాటడం, మహాలక్ష్మి పథకం తదితర  అంశాలపై సమీక్ష చేశారు. రాష్ట్ర మంత్రులు వివిధ అంశాల వారీగా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు కలెక్టర్లు, అధికారులు నిర్విరామంగా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని, క్షేత్రస్థాయిలో  జిల్లా కలెక్టర్లు, అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్నో పథకాల ఫలితాలను వారికి అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, దానికగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని మంత్రులు స్పష్టం చేశారు.