తెలుగునాడు, హైదరాబాద్ :
సృజనాత్మకతతో విద్యా వికాసాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు తెలంగాణ బాలోత్సవ కార్యవర్గం ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరం నేటి నుండి ప్రారంభమైంది. ఈ శిబిరం 20 రోజులపాటు రెసిడెన్షియల్ విధానంలో నిర్వహించబడుతుంది. నాల్గవ తరగతి నుండి ఇంటర్ వరకు విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు.
ఈ శిబిరంలో విద్యార్థులకు సాంకేతికతపై నైపుణ్యాభివృద్ధి, రాజకీయ మౌలిక అంశాలపై అవగాహన, శాస్త్రీయ దృక్కోణాన్ని అభివృద్ధి చేయడం, లింగ సమానత్వం మరియు సామాజిక సమానత్వం వంటి అంశాల్లో సూచనలు అందించబడతాయి. చిన్నతనంలోనే పిల్లలు ఇంటి పనుల్లో భాగస్వాములవ్వాలని సూచించారు.
కల్చరల్ యాక్టివిటీల్లో భాగంగా డ్రామా, నాటకం, నృత్యం, జానపద గేయాలు, కథలు, పాటల బోధన ద్వారా సామాజిక చైతన్యం కలిగించే ప్రయత్నం జరుగుతుంది. శారీరక ఆరోగ్యానికి యోగా, ఆహార నియమాలు, దినచర్యలో మార్పులపై శిక్షణ ఇవ్వబడుతుంది.

ఈ శిబిర ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిధులుగా ఐద్వా జాతీయ నాయకురాలు శ్రీమతి జ్యోతి , డాక్టర్ నళిని , బాలోత్సవ కమిటీ అధ్యక్షులు భూపతి , సెక్రటరీ సోమయ్య , ఉపాధ్యక్షులు సుజావతి , ప్రిన్సిపాల్ అంకమ్మ, కవయిత్రి రూప రుక్మిణి , చైల్డ్ సైకాలజిస్ట్ మమత , ప్రిన్సిపాల్ పద్మ హాజరై, శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ వేసవి సెలవులను విద్యా, సాంఘిక, సాంస్కృతిక వికాసానికి వినియోగించుకుంటున్న విద్యార్థులను వారు అభినందించారు.