చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద సిఐటియు ధర్నా
తెలుగునాడు, హైదరాబాద్ :
చర్లపల్లి సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసులు మాట్లాడుతూ రైల్వేలో భద్రతా చర్యలు పెంచాలి. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కాపాడాలి, రైల్వే రంగంలో ప్రైవేటీకరణను ఆపాలి అని కోరారు. దేశములో ఇటీవల కాలంలో వరుసగా అనేక రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, ట్రాక్ మెయింటైనర్లు వివిధ రకాల రైల్వే కార్మికులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. వేలాదిమంది గాయపడతా ఉన్నారు. దీనితో వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రైల్వే వ్యవస్థను కేంద్ర బిజెపి ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తున్నది .ఈ నేపథ్యంలో రైల్వే రంగంలో భద్రతా చర్యలు పెంచాలని, ప్రమాదాలను అరికట్టాలని అన్నారు. చాలా సంవత్సరాలుగా రైల్వేలో భద్రత సంబంధించిన పోస్టులతో సహా వివిధ క్యాడర్లలో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి .వీటిలో లోకో పైలట్ పోస్టులే సుమారు 20వేల వరకు ఉన్నాయి. తక్కువ సిబ్బందితో పని భారం పెరుగుతుంది.
రోజుకు 14 గంటలు పనిచేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు వరుసగా నాలుగు రోజులు రాత్రి షిఫ్ట్ కూడా చేయవలసిన దుస్థితి నెలకొన్నది. వారాంతపు సెలవులు కూడా ఇవ్వడం లేదు. దీనికి తోడు సిగ్నల్ వ్యవస్థ లోపాలు కూడా తోడవుతున్నాయి.ఇన్ని లోపాలు ఇబ్బందుల మధ్య పని చేస్తున్న సిబ్బందికి రక్షణ లేకుండా పోయింది . రోజుకు కోటి 50 లక్షల మందికి రవాణా సౌకర్యంగా ఉన్న రైల్వే రంగాన్ని పటిష్టంగా అమలు జరపకుండా ప్రాథమిక బాధ్యతనుండి ప్రభుత్వం తప్పించుకుంటుంది. కోవిడ్ తర్వాత సాధారణ ప్యాసింజర్ రైళ్లను బాగా తగ్గించారు . సుమారు 160 సర్వీసులను నిలిపివేశారు. ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ కంపార్ట్మెంట్ల సంఖ్య తగ్గిపోయింది. వాటి స్థానములో వందే భారత్ మరియు డైనమిక్ చార్జీల వంటి రైలను ప్రవేశపెట్టారు. సీనియర్ సిటిజెన్లు, పిల్లలు, వికలాంగులు మొదలైన వారికి ఇచ్చే రాయితీలు పూర్తిగా తొలగించేశారు. రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లు, గూడ్స్ షెడ్లను, వాటి నిర్వహణ ,పరిపాలన ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. రైల్వే ప్రైవేటీకరణ వలన సరుకు రవాణా చార్జీ పెరగటంతో వస్తువుల ధరలు పెరుగుతాయి. భద్రత పట్ల నిర్లక్ష్యం, కార్పోరేట్ లాభాలు పెంచడం కోసం రైల్వేను కేంద్ర ప్రభుత్వం బరితెగించి ప్రైవేటీకరిస్తున్నది. ఈ పరిస్థితులలో రైళ్లు సురక్షితంగా నడిచేటట్లు, ప్రమాదాల నుండి ప్రయాణికులు మరియు రైల్వే ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ చర్యలు తీసుకోవాలని, రైల్వే వ్యవస్థ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రైల్వే ప్రయాణికులకు భద్రతకు సరైన చర్యలు చేపట్టాలి. ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలి. విస్తరణ మరియు భద్రత కోసం అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే .చంద్రశేఖర్చర్లపల్లి ప్రధాన కార్యదర్శి జి .శ్రీనివాసులు నాయకులు సిహెచ్ ప్రసాద్, ఎమ్మెస్ రావు, ఎస్. శరత్ బాబు, కె.వి చారి, జి.హరిప్రసాద్ టి. రవీందర్ రెడ్డి, పండయ్య , బాలకృష్ణ, నరసింహ ,గణేషు, సుబ్రహ్మణ్యం ,షణ్ముఖ ,జయంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు .