రెండేళ్ళలో దేవాదుల పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

రెండేళ్ల వ్యవదిలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఆలేరు,భోనగిరి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని ఆయన వెల్లడించారు.

శనివారం రోజున సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,శాసనసభ్యులు కడియం శ్రీహరి,యశస్విని రెడ్డి,నాయిని రాజేందర్ రెడ్డిలతో కలిసి ఆయన ధర్మసాగర్ మండలం పరిధిలోని దేవాదుల ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు.

అనంతరం వరంగల్, హనుమకొండ,కాజీపేట నగరాల ప్రజల దాహార్తిని తీర్చే సుప్రసిద్ధ భద్రకాళి చెరువు పూడిక తీత పనులను ఆయన పరిశీలించారు.

దేవాదుల మూడో దశ ప్యాకేజీ కి సంబంధించిన 49.06 కిలోమీటర్ల పొడవైన ప్రధాన సొరంగ మార్గం పనులను అయన సమీక్షించారు. ఇక్కడ ఇప్పటికే రెండో పంప్ హౌజ్ ప్రారంభమైనదని దీని ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ కు 62 గంటల పాటు నీటిని నింపినట్లు ఆయన వివరించారు. మే మాసంతానికి మొదటి పంప్ హౌజ్,జులై మాసంతానికి మూడో పంప్ హౌజ్ లను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.

అనంతరం హనుమకొండ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సితక్కలతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో లోకసభ సభ్యులు కడియం కావ్య,శాసనమండలి సభ్యులు రామచంద్ర నాయక్,బసవరాజు సారయ్య, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య,మేయర్ గుండు సుధారాణి,శాసనసభ్యులు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి,నాగరాజు,గండ్ర సత్యనారాయణ రావు,యశస్విని రెడ్డి, మురళి నాయక్ నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,పౌర సరఫరాల శాఖా ప్రధాన కార్యదర్శి డి.ఎస్ చౌహన్,ఇ. ఎన్.సి అనిల్ కుమార్ లతో పాటు హనుమకొండ కలెక్టర్ ప్రావిన్యా రెడ్డి,వరంగల్ కలెక్టర్ సత్య శారద తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో కోటి 80 లక్షల కోట్ల రూపాయలు నీటిపారుదల రంగంలో ఖర్చు చేసినా కొత్తగా ఆయకట్టు సృష్టించ లేక పోయారని ధ్వజమెత్తారు.

ప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచడం వంటి తప్పిదాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు.

పెండింగ్ ప్రాజెక్టు లను నిర్ణిత వ్యవధిలో పూర్తి చేసి ఖర్చు పెట్టె ప్రతి రూపాయి రైతులకు సాగు నీరు అందించేందుకు వినియోగిస్తామన్నారు.

దేవాదుల ప్రాజెక్టు పూర్తికి ఒకేసారి సరిపడా నిధులు విడుదల చేసి పనులు వేగవంతం చేస్తామన్నారు.దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు.

దేవాదుల పూర్తికి అదనంగా 3,312 కోట్లు అవసరమౌతున్నదని ఆయన వివరించారు.

అయితే సొరంగమార్గం చివరలో లీకేజీలను నివారియించేందుకు గాను మిషన్ భగీరధ పైప్ లైన్ పనులకు ఆటంకం కలుగ కుండా ఉండేందుకు కామారెడ్డి జిల్లా మంజీరా ప్రాజెక్టు నుండి 110 పెద్ద సైజ్ స్టీల్ పైపులు తెప్పించినట్లు ఆయన పేర్కొన్నారు

వాటిని మూడు వరుసలుగా అమలు పరుస్తున్నట్లు మే మాసంతానికి పూర్తి అయితాయని ఆయన తెలిపారు

వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడు నగరాల ప్రజల దాహార్తిని తీర్చే సుప్రసిద్ధ భద్రకాళి చెరువు పూడిక తీత పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.
11.5 లక్షల క్యూబిక్ మీటర్లలోతు పేరుకు పోగా ఇప్పటికే 2.7 లక్షల క్యూబిక్ మీటర్లు తొలగించి నట్లు ఆయన తెలిపారు మిగిలిన మట్టిని తొలగించేందుకు 16.కోట్ల రూపాయల ను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

ధాన్యం దిగుబడిలో తెలంగాణా యావత్ భారతదేశంలొనే సరికొత్త రికార్డు నెలకొల్పిందని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల అనుసరించిన విధానాలతోటే ఇది సాధ్యపడిందన్నారు.

ఖరీఫ్ సీజన్ లో 153 లక్షల మెట్రిక్ టన్నుల పై చిలుకు దిగుబడితో రికార్డు నెలకొల్పిన తెలంగాణా రాష్ట్రం ప్రస్తుత యాసంగిలొనూ అదే రికార్డు పునరావృతం కాబోతుందని ఆయన తెలిపారు.

యాసంగి సీజన్ లోను వానకాలం రికార్డును సమం చేస్తూ ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

రబీ సీజన్ లో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు

ఇప్పటికే 28 లక్షల 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,32,347 రైతుల నుండి కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యంలో సన్నాలు 10 లక్షల 32 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాం ఉండగా 14.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకాలని ఆయన వివరించారు.

ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ 5,664.09 కోట్లు కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించిన మొత్తం 3,163.47 కోట్లు అని తెలిపారు.

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల వ్యవధిలో రైతుల ఖాతాలో నగదును జమ చేస్తున్నట్లు ఆయన వివరించారు

యాసంగిలోనూ సన్నాలకు బోనస్ లు చెల్లిస్తున్నామన్నారు.

అర్హులైన నిరుపేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పంపిణీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైన మార్పుగా ఆయన అభివర్ణించారు

పేదల కళ్ళలో వెలుగులు నింపాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమన్నారు