రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్
తెలుగునాడు, హైదరాబాద్ :
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపు కు విశేష స్పందన లభించిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు చక్రిపురం లోని శ్రీచక్రి విద్యానికేతన్ హై స్కూల్ ప్రాంగణంలో 116వ మెడికల్ క్యాంపు జన విజ్ఞాన వేదిక కాప్రా, మల్కాజిగిరి, కీసర మండల కమిటీల సమన్వయంతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం జన విజ్ఞాన వేదిక ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఈ క్యాంపు విజయవంతం కావడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ క్యాంపులో నిపుణులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు చేసి, అవసరమైన సలహాలు, చికిత్సలు అందించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన మండల కమిటీలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు దీప్తి, దేవీక, విద్యసాగర్, జయరాజు, సంగీత, మెడికల్ క్యాంపు ఆర్గనైజర్ కరుణాకర్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక నాయకులు ప్రభాకర్, రమణ,శ్రవణ్ కుమార్, ఎంఎల్ చౌదరి, నాగేశ్వర్ రావు, సోమయ్యచారి తదితరులు పాల్గొన్నారు.