తెలుగునాడు హైదరాబాద్ :
సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రజా ప్రభుత్వం చేపట్టిన మిషన్‌లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన సంస్కరణలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని చెప్పారు. అందుకోసం తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా రాష్ట్ర గొప్పతనాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటాలని కోరారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన భారత్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని, సంక్షేమ పథకాలను, మరియు సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.

ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. 20 వేల కోట్ల రూపాయలతో 25 లక్షలకుపైగా రైతులకు రుణమాఫీ చేసి దేశ చరిత్రలోనే అతిపెద్ద రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేశాం. సేద్యానికి 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 12 వేలు పంట పెట్టుబడి సహాయం, భూమి లేని వ్యవసాయ కార్మికుల కుటుంబానికి కూడా రూ. 12 వేల మద్దతుని ప్రభుత్వం అందిస్తోంది.
ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు ప్రతి క్వింటాలుపై రూ. 500 అదనపు బోనస్ అందిస్తూ రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం.
యువతకు నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని స్థాపించాం. గతంలో ఉద్యోగ నియామకాలు లేని పరిస్థితిని సవరిస్తూ, ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 5 లక్షల మంది యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించబోతున్నాం.