ఉద్యోగులకు అందుబాటులోకి 12 బెడ్ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్
ప్రారంభించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
తెలుగునాడు, హైదరాబాద్ :
తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో గుండె జబ్బులకు సంబంధించిన క్యాథ్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యాథ్ ల్యాబ్ తో పాటు 12 బెడ్లకు విస్తరించిన ఎమర్జెన్సీ కేర్ యూనిట్‌ను శుక్రవారం టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రారంభించారు. ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ సహకారంతో తార్నాక ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ ను సంస్జ ఏర్పాటు చేయగా.. క్రిటికల్ కార్డియక్ కేర్ యూనిట్ కు అశోక్ లేలాండ్ సంస్థ సహకరించింది. అలాగే, ఎమర్జెన్సీ కేర్ యూనిట్ విస్తరణకు నిర్మాణ్ డాట్ ఓఆర్‌జీ అనే సంస్థ ద్వారా ఐఓసీఎల్ ఆర్థిక సాయం చేసింది. ప్రారంభోత్సవంలో వీసీ సజ్జనర్ మాట్లాడుతూ టీజీఎస్ఆర్టీసీకి ప్రధాన వనరులైన ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ఉంటుందని యాజమాన్యం భావించి తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్ఫిటల్‌గా తీరిదిద్దామని చెప్పారు.

దేశంలో ఏ ఆర్టీసీలో లేనివిధంగా ఉద్యోగులకు ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలను ఉద్యోగులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తార్నాక ఆస్పత్రిలో 2021లో ప్రతి రోజు సగటున 600 అవుట్ పేషంట్లు రాగా ప్రస్తుతం దాదాపు అది 2 వేలకు పెరిగిందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని క్యాథ్ ల్యాబ్, క్రిటికల్ కార్డియక్ కేర్ యూనిట్ తో పాటు ఎమర్జెన్సీ కేర్ యూనిట్ విస్తరణకు సహకరించిన ఐఓసీఎల్, ప్యాక్ట్స్ ఫౌండేషన్, అశోక్ లేలాండ్ సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా సజ్జనర్ అభినందించారు. ఈ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పూర్తిస్థాయి MRI, CT స్కాన్ సౌకర్యంతో పాటు ఎమర్జెన్సీ వార్డు, 24 గంటల ఫార్మసీ, ఫిజియోథెరఫి యూనిట్ అందుబాటులో ఉన్నాయన్నారు. తాజాగా క్యాథ్ ల్యాబ్ సేవలను ప్రారంభించడంతో ఇక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఉద్యోగులతో పాటు వారి జీవిత భాగస్వాములకు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి.. అందరి హెల్త్ ప్రొఫైల్స్‌ను రూపొందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలున్న 900 మందికి తార్నాక ఆసుపత్రిలో అత్యవసర చికిత్సను అందించి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు తెలిపారు. సాంకేతికతను వినియోగించుకుని ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్ లోనూ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు ఎన్నో కార్యక్రమాలను యాజమాన్యం తీసుకువస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్ తో పాటు ఐఓసీఎల్ నుంచి సురజ్ కుమార్, భాస్కర్ రావు, కైలాస్ కాంత్, నిర్మాన్ ఆర్గనైజేషన్ నుంచి శాంతి కుమార్, అనురాధ, ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ ఎండీ డాక్టర్ శ్రీనివాస్ కుమార్, అశోక్ లేలాండ్ ప్రతినిధులు నీరేష్ తివారి, సూర్యనారాయణ, రమేశ్ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.