హనుమాన్ జయంతి ఉత్సవాల రూట్ మ్యాప్ లను పరిశీలించిన కమిషనర్

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్

హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అధికారులను ఆదేశించారు. కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం, కొత్త పేట, చంపాపేట్, సింగరేణి కాలనీ, సరూర్ నగర్ లోని ట్యాంక్ బండ్ పోస్ట్ ఆఫీస్, గాంధీ విగ్రహం, దిల్సుఖ్ నగర్, సరస్వతి నగర్ వంటి ప్రాంతాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాల రూట్ మ్యాప్ లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

రాచకొండ పరిధిలోని సున్నితమైన ప్రదేశాలలో ఉత్సవాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతియుతంగా ఊరేగింపులు జరిగేలా చూడాలని, భక్తులతో, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. మతసామరస్యానికి భంగం కలిగించే చర్యలను పోలిసు శాఖ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. భక్తులు, ప్రజలు సంతోషంగా, శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంట ఎల్ బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ జి నరసింహా రెడ్డి, డీసీపీ ట్రాఫిక్-2 శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.